Posts

Showing posts from December, 2020

మైత్రి!!

Image
        కొలను కలువల, కలకల విరిసెను/          నీలి గగనము వెన్నెలల చందురునితో!/         అలతిఅలతి యిట్టి దూరములేమి చేయు/         చెలిమి పరిమళ మాల నిర్వుర కూర్చన్!

మాయ లేడి!

Image
  ఈ బంగరు తళతళల మేను,రజత ముద్రల    బోలు చుక్క/   లా బిత్తరి చూపుల, ప్రముగ్ధ, జనకసుత భ్రమ   యుట కాదె/   ఈ బ్రువు మారీచు ప్రాణహంస మెగిరె,శ్వేతమరాళి    దూరుడయ్యె/    ఆ బ్రృహత్కోదండి, కీర్తిహంస వీడె రావణు కాల       సరి ద్మౌనములన్!

నీటాట(నీటి ఆట)

Image
   గడి తేరిన వీరు ధనుసల్లె వంగుచు     బుడుంగుమని,/    సడి సేయక విస్సున నీటి చీల్చి, పై    కెగయు సలిల/    క్రీడా నేర్పరులివి! ఆటలాడి, ఒక     ఆటాడించు రాణ/    లీ డాల్ఫిన్ల హడావిడింతింత కాదయా,                      కూర్మ  నారాయణా !! 

ప్రాభాతము!!

Image
    కలల అలల దాటి నిదుర మేల్కొనగానె/     అల గగన మిత్రుని మ్రృదు కరచాలనము/     ఇల తరు వరుల స్నేహ సమీర లాలనము/     తుల కలదె ప్రాభాత మౌన ప్రక్రృతి గీతికిన్!

పక్షి మేస్త్రి!!

Image
గరికల గడ్డిపోచల చక చక అల్లి ఇలు గూర్చు / మెరిక ఇదియె,పక్షి లోక గ్రృహనిర్మాణ మహా రథి!/ అరలై గదు లరమరిక లేక పిల్ల పాపలందరి/ కౌర! నింగికి నేలకు నడుమను ఊగు చిరు ఊయలై!!

నీలము!

Image
కంఠమున నీలము నిల్పియు, శీతల గాంగవర్షి  కపర్ది/ కంఠము సునీలమయ్యు, స్వరమూల షడ్జమున కీ కలాపి/ పాటవమున పాల్కడలి అలల తూగు హరి, నీలదేహి/ ఎట్టి వర్ణము వారైన,గుణ సువర్ణమున్న మెత్తురే  కద!!

బాలసేవ!!

Image
       మోమెత్తెనే పూలవని, వన్నెల విరి/        సామి విరిసినదైనను నిండు సిరి!/        ఆమెతలు కూర్ప గిరిజ నెరి వేణి/        అమర సుమ చయము కాశ్చర్య వార్ధి!

ఉపకారి!!

Image
పోసినదెపుడో చిన్నపుడిన్ని నీళ్లు,నీదు పాదున/ కోసిన కాయల,త్రాగిన ఖనిజ జలముల లెక్కేలేదు/ వేసిన పెళ్లి పందిళ్ళకు,చేసిన చీపుళ్ళ కంతు లేదు/ ఓసి కొబ్బరి,ఇన్ని మేళ్ళు మాకు కట్టబెట్టిన,నీవు!                                  (ii) అర్ధులకిచ్చి యిచ్చి, బాగ సంతసించు దాతవు కాదే/ పాదప మందార, నారాయణ రూప,నారికేళ విభో!!                                  ****

ప్రాభాత లక్ష్మి!

Image
ఏకపాదమున నిల్చు మౌనులట్లు వృక్ష                  చామరములు/ సౌఖ్య కర సామీరముల సేవింపగ,తరణి  తరుణ/ సు కరమాలికలు గ్రీవము నలంకరింప, భువి,దివి/ సకలోత్సహలై  గారవించె, ప్రాభాతలక్ష్మి కదలన్.

స్థాన బలం!!

Image
  రివ్వున సాగు గాలికె తుర్రున పారెడి ఉడుత/   నవ్వుల త్రోసె,దవ్వుల కెగురు రెక్కల వీరులు,/   బల్వన్నెల చిల్కలని సరకు సేయక,గింజలకై!/   చేవ, నీ చేతి చలవదో,స్ధాన బలమో,శ్రీరామా!!

సూక్ష్మము!

Image
    చిన్ని విత్తనము లోన దాచె పెను వటము     చిన్ని వదనము లోన చూపె సర్వ జగము     కనుగవ తోచు ద్రృశ్యమంత వెలి రూపము     మనముల కందని వాని, లో తలపులకున్!!

వాణీ హాసము!

Image
          దినకరుని కరములు,పలుకుల /           రాణి పదముల తాకగ,నలరించె/           వీణా సుస్వర లహరులా ద్యుమణిని!           నెనరున,సర్వశ్వేత అల్లన నవ్వన్!!

రమ్య వని!

Image
జయదేవ మధురకవితా ఘంటమునకు రాధామాధవ కేళీ విహార స్థలియై/ ప్రియ సందేశ వహ యక్ష భావ భర కాళిదాస మేఘమునకు విశ్రమ దేశమై/ సంయమి జనావాస జనకజా చిత్తహర,వాల్మీకి గంగా తీర నిసర్గ వనమై/ అయ్యమరవరులే ముగ్ధులై విడిది సేయు క్వచిదున్నత వృక్ష పీఠి, మనోఙ్ఞమై!!

సుత భక్తి!

Image
    ఆదరమొప్ప లింగ పూజల కేతెంచిన/     ఆది నమస్సుల గణపతి,శుండాదండ/     పృథు బృంహితముల పంచాక్షరి పల్కెనో/     విదళిత కాలున కయ్యగజా పతికిన్!!