మేష్టారు గారు! (ప్రధానోపాధ్యాయులు)



అబ్బబ్బబ్బ, ఏది వచ్చినా భరించ లేని పిల్లలూ,వారి పెద్దలూనూ!!

పట్టుమని మూడు వారాలు కాలాడించకుందా ఇంటి పట్టున ఉండమంటే విల విల లాడుతున్నారు.

బళ్ళు,, ఆఫీస్ లూ సజావుగా సాగినప్పుడేమన్నా, బుధ్ధి చట్రంలో ఉండేదా?! అబ్బే అదీ లేదు! "మేష్టారూ, కడుపులో నెప్పి" అని పిల్లలూ, "మా బామ్మ పోయింది,ఒక్కణ్ణే వారసుణ్ణి" అనో,మా
"తాతయ్య,పెద్దాయన,ఒంట్లో సుస్తీగా వుందట" అనో పెద్దల అర్జీలు,వాటితో పాటు బిక్కమొహాలూ పెట్టీ నా ముందుండే వారు, క్యూలు గట్టి!!

నేతి అన్నం, కూరా అమ్మ పెట్టినవి తినకుండా, వేరే గడ్డి మేస్తే రాదురా, మరి, కడుపు నెప్పీ!!

నువ్వే నా ముందు నుంచొని ఇంతున్నావే,లేపాక్షి నంది లాగా,మీ తాతయ్య, పెద్దవాడు కాక చంటి వాడవుతాడ్రా?!!

ఏం కథలూ కారణాలయ్యా, ఇవన్నీనూ?!

ఇప్పుడేమో,సెలవులతో బాధపడుతున్నాట్ట, ఇంత పనుంటే ఇప్పించండి అని వేడికోలు!!

సరే, అఘోరిద్దురు గాని లే, నాల్గు రోజులాగండి, ఆ కరోనా దాందారిన అది పోతుందీ, అప్పుడు ఇక వద్దన్నా, నడుము విరిగేంత పని ఉంటుందిలే!! ఆప్పుడొచ్చి, చూపిద్దురు గాని మీ కార్య కౌశలం! అందాకా, బుధ్ధిగా ఇంట్లోనే ఉండండి, ఇల్లు దాటద్దు, ఖబడ్దార్!!

ఏవో చేగొడిలో, చక్కిలాలో చేసుకుని తింటూ, చందమామ కధలు నెమరు వేసుకుంటూ కాలక్షేపం చెయ్యండర్రా!  రమ్మంటే వచ్చేవా ఈ ఇళ్లలోనే కూచుని చేసే ఉద్యమాలు!! రావొద్దనే కోరుకుంటాం అనుకోండి, అందరం,కానీ వచ్చి పడిందిగా, ఎలాగో అలా భరించి నిభాయించొద్దూ మరి!!

వింటారుగా, పిల్లా జెల్ల, పెద్ద చిన్నా,ముసలి ముతకా అందరూ!!

వినండర్రా, ఏదో నాలుగు ముక్కలు చదివి,నాలుగు కాలాలు చూసిన వాణ్ణి చెపుతున్నాను!!

ఉండవురా, నాయనా, ఏవీ కలకాలం, ఎన్నో వచ్చాయి,ఎన్నో పోయాయి, ఇదీ అంతే!!

కావాల్సిందల్లా, కాస్త ఓర్పు, నిలకడా, మరీ ముఖ్యంగా ఆశ రా, ఆశ!! బతుకు మీద ఆశ, ఉత్సాహం!!

సరే చాల్లే, ఎక్కువే చెప్పాను!! ఇప్పటికిది చాల్లే!!

నేనూ మళ్లీ ఒకసారి వాల్మీకుల వారిని పలకరించాలని, రామాయణం మొదలుబెట్టి చదువుతున్నాను!! అదిగో, హనుముల వారు పిలుస్తున్నారు, ఉంటా!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!